1. వర్ణ వ్యవస్థ అవతరణ
ఆర్యులు హరప్పా - మొహంజదారో వాసులతో భయంకరమైన పోరాటం జేసి, సింధు నగరాల్నీ సింధు సంస్కృతినీ నాశనం చేశారు. సింధు నాగరికత ధ్వంసం చేయబడిన తర్వాత, ఆ ప్రాంతంలో వున్న ప్రజలు ఏమయ్యారు?
రుగ్వేద కాలంనాటికి ఆర్యులతో సంఘర్షించినవి - రెండే రెండు జాతులు. 1.మొహంజొదారో - హరప్పాలోని ద్రావిడులు. 2. కాశ్మీరి నించి అస్సాం వరకూ, ఆపై కొండలూ లోయల్లో నివసించిన మన్ఫ్మోరులు (కిరాతులు). రుగ్వేదం ఈ ఉ భయుల మధ్య ఎట్టి భేదాన్నీ చూపలేదు. వీరిద్దరినీ కృష్ణవర్ణులూ, కృష్ణ చర్ములుగా (నల్లనివారు) వర్ణించింది. ఆర్యులు తమ శత్రువులందరినీ “దస్యులు”, అనే సామూహిక నామంతో పిలిచారు. ద్రావిడ - కిరాత ప్రజల్ని ఆర్యులు దస్యులనీ దాసులనీ అన్నారు. ఆర్య-అనార్యుల మధ్య జరిగిన యుద్ధాల్లో, ఓడిపోయిన ద్రావిడ - కిరాత స్త్రీ పురుషుల్ని దాస దాసీలుగా మార్చి, ఆర్యులు వారిచే ఊడిగం చేయించుకొన్నారు. వీరే రుగ్వేదంలో దస్యులూ దాసులుగా వర్ణించబడ్డారు.
రుగ్వేదంలో పణులను గూర్చి గూడా ప్రస్తావించబడింది. “రుగ్వేదంలో అనేకచోట్ల పణుల్ని గూర్చి ప్రస్తావించబడింది. భరద్వాజ, వసిష్ట, దీర్ఘతమ, గోతమ, రహూగణ, గృత్సమద, హిరణ్యస్తూప, అసితదేవల యిత్యాది ప్రసిద్ధ రుగ్వేద రుషులు ఈ పణులను గూర్చి చెప్పారు.” (రాహుల్ సాంకృత్యాయన్ - రుగ్వేద ఆర్యులు - పేజి 89) పణులను సైతం ఆర్య రుషులు దస్యులూ దాసులూ అని అన్నారు. పణులు ఆర్యుల శత్రుకోటిలోని వారు కారు. వారు పాలిచ్చే గోవులు! ఈ పణులు ద్రావిడ జాతికి చెందిన వ్యాపారస్తులు : ఐశ్వర్యవంతులు. పణి శబ్దంనించి "వణిక్" శబ్దం పుట్టింది. వీరికి వ్యాపారంతో పాటు గోసంపద సైతం వుండేది. వీరి ఆవుల్ని దొంగిలించడమే ఆర్యులు తమ ప్రధాన వృత్తిగా పెట్టుకొన్నట్లు రుగ్వేదంలో కన్పిస్తుంది. ఇందుకు రుగ్వేదం - పదవ మండలంలోని సరమా-పణుల సంవాదమే, ఎదురులేని సాక్ష్యమిస్తుంది. సరమా -దేవతల కుక్కగా చిత్రించబడింది. ఈ కుక్క, ఆర్యుల హింసాపూరిత ప్రవృత్తికీ, వారి దారిదోపిడీ విధానానికీ ప్రతీక.
ఆర్యులచే యుద్ధంలో పరాజితులై పట్టుబడిన ద్రావిడ తర కాలంలో వర్ణవ్యవస్థలో నాలుగో వర్ణమైన శూద్రులుగా.. "ఆర్య రుషియైన గృత్సమదుడు దాసులను దేవతలు! నీచవర్ణంగా చేశారని చెప్పడంలోని అర్థం యిదే." (రుగ్వేద ఆర్యులు పేజి 59) "ఈ కృష్ణయోని దాసులను, ఇంద్రుడు నాశనం చేశాడు. (రుగ్వేదం 2-20-7) కృష్ణత్వక్కులను ఇంద్రుడు నాశనం చేశాడని పురుచ్చేపుడు చెప్పాడు. (రుగ్వేదం 1-130-8) కృష్ణయోనులు - కృష్ణత్వక్కులు - అంటే నల్లని చర్మం గలవారని అర్థం. “వీరిని అకర్ములూ అమంతులూ అన్యధర్మరతులని రుగ్వేద రుషియైన విమదుడు అన్నాడు. (రుగ్వేదం 10-22-8) ఇంద్రుడు దాసవర్ణమును నీచంగా నామరహితంగా చేశాడు. అని గృత్సమదుడు అన్నాడు. (రుగ్వేదం 2-12-4) “ఓ ఇంద్రా, ధనవంతుడైన దస్యుని చంపుము" అని హిరణ్యస్తూపుడు ప్రార్ధించాడు. (రుగ్వేద ఆర్యులు - పేజి 101.)
ఈ ద్రావిడ - ఆదిమజాతులకి చెందిన వారినందరినీ, ఆర్యులు దస్యులూ దాసులుగా పరిగణించినా, వాస్తవానికి వీరంతా బానిసలు మాత్రం కాదు. వీరిలో మత గురువులూ, పణులవంటి వ్యాపారస్తులూ, బానిసలూ వున్నారు. అయితే వీరిలో కొందరు మాత్రం, క్రమేణా ఆర్య సంఘంలోకి సైతం ప్రవేశం సంపాదించగలిగారు. ఆర్య సాంఘిక వ్యవస్థలో మార్పులు తెచ్చేంత అధికంగా వీరు ప్రవేశించగలిగారంటే, ఈ “దాసులు” కేవలం దాసులుగారనేది స్పష్టం. ఉదాహరణకి - వైదిక రుషుల్లో కొందరు ఆర్యేతరులు వొచ్చి జేరినట్లు చెప్పడానికి మనకు సాక్ష్యాధారాలున్నాయి. దీర్ఘ తమస్సు అనే వైదిక రుషి, మమత అనే దాసీ యొక్క కుమారుడు. అలాగే రుగ్వేద రుషియైన కవస ఐలూషుణ్ణి, "దాస్యాః పుత్ర" అని తిట్టి, బయటకు గెంటారు. దీన్నిబట్టి, ఆర్య-అనార్య ప్రజలకి చెందిన వివిధ తరగతులు క్రమేణా మిశ్రమమైనట్లు కన్పిస్తోంది.
సింధు నాగరికతకి చెందిన ద్రావిడ - ఆదిమ వాసుల్లో, వృత్తి విభజన వుండేది. వైదికార్యులు ద్రావిడ - ఆదిమవాసుల్ని యుద్ధాల్లో ఓడించి, బానిసలుగాచేసి, వారిని వర్ణక్రమంలో శూద్రులుగా మార్చివేశారు. తెలుపు నలుపు అనే రంగు(వర్ణ)భేదమూ, ఆర్య - అనార్య అనే జాతి భేదము మిళితమై, వర్ణ భేదంగా తయారై, యజమాని-బానిస అనే వర్గ భేదంగా పరిణమించింది. క్రమేణా ఈ వర్ణ కుల వ్యవస్థగా రూపు దాల్చింది. ఈ సుదీర్ఘపరిణామాన్ని.
2. రుగ్వేదంలో వర్ణ వ్యవస్థ బీజాలు.
రుగ్వేదం పదవ మండలం లోని పురుషసూక్తంలో వర్ణ వ్యవస్థ గూర్చి ప్రప్రథమంగా ప్రస్తావించబడింది.
"బ్రాహ్మణోస్య ముఖ మాసీత్ బాహూ రాజన్య కృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్భ్యాగ్ం శూద్రో అజాయతే.”(పురుష సూక్తం 12 వ రుక్కు)
విరాట్ పురుషుని ముఖము బ్రాహ్మణులాయెను. బాహువులు క్షత్రియులాయెను. ఊరువులు వైశ్యులాయెను. పాదములు శూద్రులాయెను అని పురుష సూక్తంలో రాయబడింది. అయితే, ఈ ఈ శరీర భాగాలనుండి, వీరు పుట్టారని అనంతర దశలో అర్థం చెప్పబడింది.
దేవుని మొహంలోంచి బ్రాహ్మలు పుట్టినట్లయితే, మొహానికి చెందిన కళ్ళు ,ముక్కు - చెవులు నోరు దేనిలోంచి పుట్టారు? అలాగే దేవుని పాదాల్లోంచి - - శూద్రులు పుట్టినట్లయితే, దేవుని కుడిపాదం లోంచి ఏ కులాలూ, దేవుని ఎడమ పాదంలోంచి మరే కులాలూ పుట్టాయి? పురుష సూక్త రచయితగానీ, వాడి ముని మనవళ్ళుగానీ నేటికీ యీ వివరణను మాత్రం యివ్వలేదు.
ఈ పురుష సూక్తం క్రీ.పూ. 800లో రచించబడిందని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. అంచేత, వైదికార్యులు ఇండియాకి వలసవచ్చి స్థిరపడిన తర్వాతనే ఈ వర్ణ భేదం తలెత్తింది. (Cambridge History of India - Vol. 1- Page 92)
3. ఆర్యో త్రైవర్ణితకాః
మొట్టమొదట ఆర్యుల్లో వర్ణభేదం లేదు. అనంతరమే మూడు వర్ణాలు వొచ్చాయి. ఈ దశలోనే...
రుగ్ యజుర్ సామ అనే మూడు వేదాలూ,బ్రహ్మణ క్షత్రియ వైశ్యులనే మూడు వర్ణాలూ,ధర్మ అర్థ కామములనే మూడు ధర్మాలూ ఉనికిలోకి వొచ్చాయి. ఆ తర్వాతదశలోనేనా లుగో వేదమైన అధర్వణవేదము, నాలుగో వర్ణమైన శూద్రులూ, నాలుగోధర్మమైన మోక్షమూ వొచ్చాయి. అయితే, ఏ దశలో పంచముల్ని ఈ వైదిక పురోహితులు ప్రసవించారో, మరింత లోతుగా పరిశీలించవలసిన అంశం.
నాటి వైదికార్య సమాజంలో పురోహితులూ యుద్ధవీరులూ పామరులూ 'అనే మూడే మూడు తరగతులు - అంతరాలు వుండేవి. అయితే ఈ భేదాలన్నీ తరగతి అంతరాలే గాని, వర్గ భేదాలుగా ఆనాటి కింకా రూపొందలేదు.
ద్రావిడ ఆదిమ వాసులతో యుద్ధాలు తీవ్రతరమైనకొద్దీ, సైనిక వృత్తిని అవలంభించేయుద్ధోపజీవుల సంఖ్య అధికమై, వైదికార్య సంఘంలో వారి ప్రాధాన్యం సైతం ప్రబలింది. పశుగణాలు మేసేందు కవసరమైన కొత్త గడ్డిబీళ్ళ ఆక్రమణ వరకే పరిమితమైన ఆర్యుల రాజ్య విస్తరణ క్రమేణా ద్రావిడ - అనార్య జాతుల గ్రామల్ని ఆక్రమించుకోవడం దాకా వెళ్ళింది. తత్ఫలితంగా యుద్ధాల్లో చేజిక్కిన ద్రావిడ - ఆదిమవాసుల్ని దాసులుగా జేసి, దస్యులని పిలిచి, వారిచే అడ్డమైన చాకిరీ చేయించుకొనడం ద్వారా, బానిస వ్యవస్థ పునాదిగా గల రాజ్యాంగయంత్రం అమల్లో కొచ్చింది. ద్రావిడ ఆదిమజాతుల వారిని దాసులుగా జేసి, ఆర్యసంఘంలో దోపిడీకి గురి చేయబడిన బానిసలుగా నిర్ణయించినప్పుడే, వర్ణ లేక రంగు భేదం పునాదిగా గల వర్గభేదం, భారతదేశ చరిత్రలో ప్రప్రధమంగా అంకురించింది.
(ఆర్యులు తెల్లనివారు, ద్రావిడ ఆదిమజాతులవారు నల్లనివారు) వర్ణ (రంగు) భేదమూ, ఆర్య-అనార్య అనే జాతి భేదంతో కూడుకొన్న వర్ణ వ్యవస్థ మొట్టమొదటి సారిగా ఆర్య సంఘంలో తలయెత్తింది. యజమాని (ఆర్య) బానిస (అనార్య) అనే ఆర్ధికమూలమైన, ధనిక - దరిద్ర వ్యత్యాసంతో కూడుకొన్న వర్గభేదం, ఆర్య-అనార్య అనే జాతిభేదంతో కూడిన వర్ణవ్యవస్థగా అనంతర దశలో రూపు దాల్చింది.
4. క్రీ.పూ. 800 - ఇనపయుగం.
పశువుల మందలు కాసుకొంటూ, వాటి పోషణ కోసం కొత్త పచ్చికబయళ్ళు ఆక్రమించుకొంటూ, కాయ ధాన్యాలు పండించుకొంటూ వైదికార్యులు జీవించేవారు. అయితే, వరిపంట పండించేందుకు అనువుగా భూమిని సేద్యం జేయడమూ, కాలవల ద్వారా నీరు పారించి వరి పండించడమూ . , నాటి ద్రావిడ - ఆదిమవాసులకి బాగా తెలుసు.
దాదాపు క్రీ.పూ. 800లో ఇనుము తయారు చేయడం, కమ్మరం పని, కొచ్చాయి. ఈ కాలం నాటికి, కొందరు అసురులు కమ్మరం ఇండియాలో వాడకంలో పని తెలుసుకొన్నారు. కంచుయుగపు నాగరిక దశలోనే వున్న వైదికార్యుల కన్నఇనప యుగంలోకి సాగిపోయిన ముండా - అసుర - ఆదిమ జాతులవారు, ఆనాడు “పైస్థాయి” నాగరిక దశలో వుండేవారు. ఆర్యుల తాడికిడి తట్టుకోలేని ఈ ఆదిమవాసులవారు, తూర్పుదిశగా పారిపోయి, గంగానదీ తీరంలోని అటవీ ప్రదేశాల్ని చేరుకొని, ఇనప పనిముట్లతో బాగా వ్యవసాయం చేయనారంభించారు.
కొత్త ప్రదేశాల్ని జయించి ఆక్రమించిన ఆర్యులు, ఆదిమవాసుల దగ్గర నుండి ఇనుపముల్లు గల నాగలిని వాడడమూ, వరిపంట పండించటమూ నేర్చుకోగలిగారు. ఇనప నాగలి, ఇనప పార, ఇనప గొడ్డలిని ఉపయోగించడం నేర్చుకొన్న ఆర్యులు, అడవుల్ని కొట్టి కొత్త బీళ్ళని సాగుజేయడం భారీయెత్తున సాగించారు. తత్ఫలితంగా వ్యవసాయమూ చేతివృత్తులూ బాగా వృద్ధిజెందాయి. అంతకి పూర్వమే వైదికార్య సమాజంలో ప్రవేశించిన వృత్తి విభజన, ఇప్పుడు కొత్త వృత్తులు ఉనికిలోకి రావడానికి వీలు కల్గించింది. ఈ వృత్తి విభజన బాగా స్థిరపడి, వృత్తి విశిష్టత ఏర్పడి, చివరికి “వృత్తి కులాలు" ఏర్పడేందుకి దోవతీసింది.
5. క్రీ.పూ. 500 - బ్రాహ్మణాల రచనా కాలం
ఆదిమవాసులు అడవి గ్రామాల్లో వ్యవసాయం జేసి జీవిస్తుండేవారు. వీరు నివసించే ప్రాంతం "నిషధదేశం" అనీ, వీరు "నిషాదు”లనీ, బ్రాహ్మణాలలో వర్ణించబడింది. వీరినే కిరాతులని గూడా పిలిచారు. (నిషధదేశమంటే - నిషిద్ధమైన దేశం, దానిలో నివసించేవారు - నిషద్ధమైన ప్రజలు) తమ కన్న నాగరికతలో ఉన్నత స్థాయిలో వున్న ద్రావిడ - ఆదిమ వాసుల్తో దగ్గర సంబంధాలు ఏర్పడ్డం వల్ల, ఆర్య సంఘంలో వ్యవసాయమూ చేతివృత్తులూ బాగా అభివృద్ధి తవ్వి, చేలకి నీరు పారించడం యిత్యాది పనుల్ని వీరి వద్దనుండే ఆర్యులు నేర్చుకొన్నారు. అంతే గాదు - వీరి వొద్ద నుండి నేర్చుకొన్న అనేకమైన “కుల” వృత్తుల్ని ఆర్యులు సైతం అలవర్చుకొన్నారు.
తత్ఫలితంగా ముత్యాలపనివారూ, కంసాలులూ, మేదర్లూ, కమ్మరులు, కుమ్మరులూ, చాకళ్ళు మంగళ్ళు, చర్మకారులు, తాళ్ళు పేనేవారు, విల్లమ్ములూ రధాలూ చేసేవారూ యిత్యాది వృత్తులవారు ఆర్య సంఘంలో ఉనికిలోకొచ్చారు. క్రీ.పూ. 500 నాటికి - అంటే బ్రాహ్మణాల రచనాకాలం నాటికి, సంఘంలో వృత్తి విశిష్టత బాగా వ్యాపించింది. (Walter Ruben - Introduction to Indology - Page 105)
6. ప్రాచ్య నిరంకుశరాజ్య అవతరణ.
ఆదిమవాసుల నుండి గ్రామ ఉమ్మడిపై "కరము” అనే పేరిట ధాన్యరూపేణా
పన్ను వసూలు చేయడంద్వారా, ఇళ్ళల్లో బానిసలచే పనులు చేయించుకోవడం ద్వారా,
వస్తూత్పత్తి బాగా పెరిగింది. వేదకాలం నుండి స్థిరనివాసం లేకుండా దేశ దిమ్మరులుగా తిరుగుతోన్న ఆర్యగణాలు యిప్పుడు స్థిరపడి, రాజ్యాలు స్థాపించడం ప్రారంభించాయి. . కోసల - కురు పాంచాల కాశీ గతంలో వున్న సైనిక రాజ్యం (State) క్రమేణా ప్రాచ్య నిరంకుశ రాజ్యంగా పరిణామం చెందింది. ఉత్పత్తి విధానంతోపాటు రాజ్యాంగ విధానం సైతం మారినందువల్ల, సాంఘిక వ్యవస్థ సైతం విధిగా మారవలసి వొచ్చింది. చేతిపనుల విభజన మరింత స్థిరపడి, వృత్తి విశిష్టత ఏర్పడింది. గతంలో పురోహితులు మినహా అంతా ఆయుధాలు ధరించే వారు. కాని యిప్పుడు ఆయుధాలు చేపట్టి యుద్ధం జేయడం, క్షత్రియులకు మాత్రమే పరిమితం జేయబడింది! చేతివృత్తులూ వ్యవసాయమూ జేసే ప్రజలకి ఆయుధధారణ నిషేధించబడింది. ఇంతవరకూ వ్యవసాయం పశుపోషణ చేతిపనులు చేసే పామర జనంలో కుటుంబవృత్తులు ఏర్పడి. వ్యాపారం జేసే వైశ్యులు వొక ప్రత్యేక కులంగా వేరుపడిపోయారు.
ఆర్య సంఘంలో రానురాను వృత్తి విభజనా, వృత్తిభేదాలూ ఏర్పడ్డాయి. వ్యవసాయం జేసే కర్షకులూ, గోగణాల్ని కాచే గోపాలురు, ప్రత్యేక శాఖలుగా కమ్మరులూ వడ్రంగులూ రధాలు చేసేవారు ఏర్పడ్డారు. ఈ విధంగా వృత్తి ప్రత్యేకత ద్వారా వృత్తి విశిష్టత, వృత్తి విశిష్టత ద్వారా వస్తూత్పత్తి అభివృద్ధి చెందింది. వొకసారి శ్రమ విభజన ప్రారంభం కావాలే గాని, అది ప్రారంభమయ్యాక ఉత్పత్తి విధానం యొక్క నర నరానికీ అది పాకిపోతుంది. అవసరమైన దానికన్న అదనంగా ఉత్పత్తి ఎప్పుడు జరుగుతుందో, నాటినుండి మారకం సైతం ప్రారంభమవుతుంది. మానవులు మారకం వేయడం ప్రారంభించాక, మానవుల్నే మారకం వేస్తారు - అనే ఎంగెల్స్ సూత్రీకరణ ప్రత్యేకంగా గమనార్హం.
అస్త్ర శస్త్రాలు ధరించే రాజకుటుంబీకులూ, యజ్ఞయాగాలు నిర్వహించే పురోహితులూ అగ్రవర్ణాలుగా ఏర్పడ్డారు. వ్యవసాయమూ చేతిపనులూ చేసే కష్ట జీవులు ఉత్పత్తిజేసిన అదనపు సంపదలో హెచ్చు వాటాల కోసం అగ్రవర్ణాలకి చెందిన బ్రాహ్మణ -క్షత్రియులు గుద్దులాడుకో నారంభించారు.
7. వర్ణాలలో రకాలు
A. బ్రాహ్మలు.
దాదాపు క్రీ.పూ. 1500-1000 ఏళ్ళమధ్య రచింపబడిన వేదాలు అంతరించి పోకుండా వుండేందుకు, యజ్ఞకర్మలు చేయించే పురోహితులు వేదాల్ని కంఠతా పట్టడం ప్రారంభించారు. వర్షాలుపడే కార్తెలు గూర్చి, వాతావరణ విశేషాలు గూర్చి అధ్యయనం చేయడం ద్వారా జ్యోతిశ్శాస్త్రం వృద్ధి జెందింది. వేదాల్ని తమ సొంత సొత్తుగా హస్తగతం జేసుకొన్న పురోహితవర్గం అధికారం, క్రమేణా ప్రబల జొచ్చింది. వేదపారాయణను
విధిగా సాగిస్తూ, యజ్ఞయాగాది కర్మలు చేయించే రుత్విక్కులూ, హోతలూ, ఉద్గాతలూ, ఆగ్నీధ్రులూ, ఆహితాగ్నులూ, పాకయాజులూ, సోమయాజులూ, హవిర్యాజులూ యిత్యాది అమాంబాపతు యాజులంతా వొక ప్రత్యేకవర్గంగా యేర్పడి, సంఘంలో ఎదురులేని అధికారం సంపాయించ గలిగారు. తత్ఫలితంగా వేదాల్ని సొంతం జేసుకొని, వేదకర్మల్ని నడిపించే అధికారాన్ని కైవశం జేసుకొన్న యీ పురోహితులే అనంతర దశలో "బ్రాహ్మణులు”గా అవతరించారు.
యుద్ధాలకి బయలుదేరే ముందు దేవతలకి మ్రొక్కి, విజయం ప్రసాదించమని ప్రార్ధించడం, ఆయా దేవతల్ని తృప్తిపరిచేందుకు పూజా పునస్కారాలు చేయడం, యుద్ధాలూ యజ్ఞయాగాలకీ ముహూర్తాలు నిర్ణయించడం పురోహితుల విధుల్లా పరిణమించాయి. తత్ఫలితంగా రాచకార్యాల్లో సైతం తమ పలుకుబడి నిరంతరంగా పెంచుకుంటూ, వైదిక కర్మల్నీ, వేద సాంప్రదాయాల్ని తామర తంపరలా వృద్ధిజేసి, మంత్రతంత్రాలూ డాబు దర్పాలతో వైశ్యశూద్రులపై అధికారం వెలగబెట్టి, మానవచరిత్రలో ఏ దేశ పురోహితవర్గం చలాయించని పరమ నిరంకుశమైన అధికారం చలాయించి, శూద్ర బానిసలు సృష్టించిన అదనపు సంపదలో రాజులతో పాటు తాము గూడా వాటా పంచుకొని శుద్ధసోంబేర్లుగా మారి, అగ్రవర్ణమనే పేరిట భారతదేశ చరిత్రలో అగ్రవర్గంగా తయారయ్యారు.
B. క్షత్రియులు.
శూద్ర బానిసలూ ఆదిమజాతుల ప్రజలూ అహోరాత్రులూ కష్టించి సృష్టించిన సంపదను బందిపోటుల్లా దోపిడీజేసి, రధాల పందేల్లో, చదరంగం వంటి మద్యపానంలో తమ కాలాన్నంతా కాల్చుతూ, కొంపలంటుకుపోయే జూదాల్లో, భోగలాలస జీవితం గడిపిన క్షత్రియులు రాచరికవర్గంగా తయారయ్యారు.
మోకాట్లో తలకాయున్న ఈ రాచరిక దున్నపోతుల్ని నిరంతరం వెనక వుండి నడిపింది - వైదిక పురోహిత వర్గమే.
C. వైశ్యులు.
"వైశ్య” పదానికి మూలం - "విష్" ధాతువు, విష్ - అంటే -కుటుంబ సమూహం లేదా గ్రామం అని అర్థం. ఆర్య గ్రామాల్లో ధనికులైన వైశ్యులు, నగరాల్లో నివాసం ఏర్పరచుకొని, వర్తకమే ప్రధాన వృత్తిగాగల కులస్థులుగా తయారయ్యారు.
పేద వైశ్యులు పల్లెల్లోనే వుండి, వ్యవసాయమూ చేతివృత్తుల ద్వారా జీవించేవారు.
D. శూద్రులు.
యుద్దాల్లో ఓడిన ద్రావిడ - ఆదిమవాసుల్ని హత్య జేయకుండా, వారిని బానిసలుగా జేసి, వారిచే అగ్రవర్ణాలవారు ఊడిగం చేయించుకొనేవారు. దశలోనే వున్నందువల్ల, ద్రావిడ-ఆదిమ అందర్నీ, మూకుమ్మడిగా
వ్యవసాయంలో వినియోగించడానికి సాధ్యం.. అంచేత, నాటి ఆదిమవాసుల గ్రామీణ వ్యవస్థను కదపకుండా, యథాతథంగానే కొనసాగించి, గానుగలు తిప్పడానికీ, మద్యం చేయడానికీ, రాజుకి చెందిన ధాన్యపు కొట్లూ, వెండి బంగారు గనులూ, లోహపు కర్మాగారాల్లో ఈ దాసుల్ని వినియోగించేవారు. ప్రధానంగా అగ్రవర్ణాలవారి గృహాల్లో ఇంటి పనులు చేయడానికి వారిని ఉపయోగించేవారు. నగరాల్లో వర్తకుల కింద గుమాస్తాలుగా, వంటవారుగా, వేగులవారుగా (గూఢచారులుగా) అంతఃపురాల్లో దాసదాసీలుగా నియమించి, వీరిచే చాకిరీ చేయించుకొనేవారు.
గ్రామాల్లో వ్యవసాయం చేతివృత్తుల ద్వారా జీవించేవారిని దాసులుగా పరిగణించినా, వారిచే వ్యవసాయం చేయిస్తూ, వారి వొద్ద గ్రామం మొత్తం మీద పంట రూపంగా "కరము" (పన్ను) వసూలు జేసేవారు. ఆర్యుల గృహాల్లో సేవకులుగా వున్న శూద్ర బానిసలు, వంట చేయడం, స్నానం చేయించడం, ఇల్లూ వాకిలీ కాపలా కాయడం, యిత్యాది పనులు చేసేవారు. వొక్కొక్కప్పుడు కొద్ది తప్పులకే అత్యంత కఠినమైన శిక్షల్నీ, మరణదండననీ వీరు అనుభవించేవారు.
E. పంచములు.
పంచములను గూర్చి వేదాల్లో ఎక్కడా ప్రస్తావించబడలేదు.
Comments
Post a Comment