రాజకీయ నాయకుల విద్వేషపు ప్రచారాల గురించిన సమాచారం లేదు: కేంద్ర హోం శాఖ

రాజకీయ నాయకుల విద్వేషపు ప్రచారాల గురించిన సమాచారం లేదు: కేంద్ర హోం శాఖ

__శ్రావస్తి దాస్‌ గుప్త 

అనువాదం : కొండూరి వీరయ్య

March 27, 2025 

No information about hate campaigns by politicians: Union Home Ministry

Reading Time: 2 minutes

ఈ కాలంలో ముస్లింలకు వ్యతిరేకంగా పెరిగిన రాజకీయ నాయకుల విద్వేష ప్రచారాలకు సంబంధించిన ప్రశ్నకు సమాధానమిస్తు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు ‘శాంతి భద్రత ల సమస్య రాష్ట్రాలదే. ఇటువంటి విషయాలు గుర్తించి దర్యాప్తు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రాలదే’అని బదులిచ్చారు. లోక్‌సభలో సమాజ్‌ వాదీ పార్టీ ఎంపీ దరోగా ప్రసాద్‌ సుజన్‌ ఈ కాలంలో దేశంలో మైనారిటీలకు వ్యతిరేకంగా ప్రముఖ రాజకీయ నాయకులు మాట్లాడటం పెరిగిందాని అడిగారు. అంతేకాకుండా అటువంటి సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానంగా కిరణ్‌ రిజిజు ప్రశ్నకు సంబంధించిన ఏ సమాచారమూ ఇవ్వకుండా బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలమీదకు నెట్టేశారు.



”రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌ ప్రకారం పోలీసు, శాంతి భద్రతల సమస్య రాష్ట్రాల పరిధిలో ఉన్న అంశాలు. రాష్ట్ర ప్రభుత్వాలే ఇటువంటి ఆరోపణలకు సంబంధించి కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి” అని కేంద్ర మంత్రి అన్నారు. విస్తృతమైన న్యాయాధికారాలున్న రాష్ట్ర ప్రభుత్వాలే ఈ విషయంలో నిర్ణయం తీసుకోగలవని కూడా తెలిపారు. అటువంటి ఆరోపణలపై చట్టం రాష్ట్రాలకు విస్తృత అధికారాలు ఇచ్చిందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా భారతీయ న్యాయ సంహిత 2023లో సెక్షన్‌ 196, 299, 353ల కింద విద్వేషపు ప్రచారాలను అడ్డుకునేందుకు రాష్ట్రాలకు పూర్తి అధికారాలున్నాయని కూడా ఆయన వివరించారు.


ఇండియా హేట్‌ ల్యాబ్‌ అనే స్వఛ్చంద సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో నమోదు చేసిన వివరాల ప్రకారం 2023లో దేశంలో 688 సందర్భాల్లో రాజకీయ నాయకులు విద్వేషపు ప్రచారాలు, ఉన్మత్త ప్రేరేపణకు పాల్పడ్డారు. అదే 2024లో అటువంటివి వెయ్యి సందర్భాలున్నాయని తెలుస్తుంది. అంటే దేశంలో ఉన్మాద ప్రచారాలు 74 శాతం పెరిగాయని కూడా నివేదిక విశ్లేషించింది. ఈ నేపథ్యంలో రిజిజు సమాధానంలోని డొల్లతనాన్ని అర్థం చేసుకోవచ్చు.

హేట్‌ ల్యాబ్‌ నివేదిక ప్రకారం ఇటువంటి వెయ్యి ఉపన్యాసాల్లో 462 ఉపన్యాసాలు రాజకీయనాయకులు చేసినవే కావటం, అందులోను 452 బిజెపి నాయకులు చేసిన ఉపన్యాసాలు కావటం గమనించాల్సిన విషయం అని స్పష్టం చేసింది. అయినా కేంద్ర ప్రభుత్వం వద్ద ఇటువంటి సమాచారమేదీ లేదని, అదంతా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని కేంద్ర మంత్రి బుకాయించటం ఇంకా విడ్డూరం. 2023లో బిజెపి నాయకులు వెలువరించిన విద్వేషపు ఉపన్యాసాలు వంద మాత్రమే. దాంతో 2024లో బిజెపి నాయకుల విద్వేషపు ఉపన్యాసాలు 352 శాతం పెరిగాయి.

రాజస్థాన్‌లోని బన్సావాడలో ప్రధానమంత్రి దేశంలోని చొరబాటుదారులు అని వ్యాఖ్యానించి ముస్లిం తర్వాత వివిధ స్థాయిలలోని బిజెపినేతలు ఈ ఉపన్యాసాలు విషయంలో జోరందుకున్నారని నివేదించింది.

దేశంలో అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల విషయంలో జాతీయ అల్పసంఖ్యాక వర్గాల సంఘం పని చేస్తుందని, ఆ సంఘానికి ఎవరైనా ఈ విషయంలో ఫిర్యాదులు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆ సంఘం దర్యాప్తు చేయించాలని రిజిష్టర్ చేశారు. మొత్తం మీద స్వయంగా ఇచ్చిన విద్వేషపు ఉపన్యాసాలతో సహా బిజెపి అగ్రనాయకత్వం ఇచ్చిన విద్వేషపు ఉపన్యాసాలు ఉన్నాయనే పరిశీలన కూడా గుర్తించటానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని ఈ సమాధానంతో వెల్లడవుతోంది.



శ్రావస్తి దాస్ గుప్త

అనువాదం : కొండూరి వీరయ్య

Comments