ఈ కాలపు అద్భుత మహిళ గూడూరు సీతా మహాలక్ష్మి

 ఈ కాలపు అద్భుత మహిళ గూడూరు సీతా మహాలక్ష్మి.



రచన: 

రేకా చంద్ర శేఖర రావు.

తేది. 10.03.2025. 


మొదటి భాగం

గత సంవత్సర కాలంగా జనవరి 2024 నుండి గమనిస్తే!…


ఆమె ఒక ఉద్యమం

అసలు ఆ మనిషి ప్రయాణాలకు విరామం లేదా! 

విసుగు, విరామం లేకుండా , అలసట లేకుండా, ఈ సంవత్సర కాలంగా ఆమె కార్యక్రమాలు చూస్తున్న వారికి ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎప్పుడూ నవ్వుతూ, సంతోషంగా కనపడుతూ , తన కార్యక్రమాలు మనం వినడంలో మైమరచేలా చెప్పడం చేస్తూ ఉంటారు. 

విపరీతమైన చొరవ, అందరిలో కలసిపోయే స్వభావం, కలవడంలో చిన్నా- పెద్దా ఆధిక్యతలు లేకుండా కలసిపోవడం, ఎంత పెద్ద వ్యక్తులతో అయినా ప్రభుత్వ అధికారులతో అయినా, మంత్రులతో అయినా ధైర్యంగా , ఎంతో గౌరవ - మర్యాదలతో కలసి మాట్లాడడం చేస్తారు.

ఇంకా ఈ మనిషికి కోపం అనేది తెలియదా అని మనకు అనిపిస్తుంది. 

2024 జనవరిలో సావిత్రీ బాయి ఫూలే జన్మదినం సందర్భంగా విశాఖ పట్నంలో పెద్ద ఎత్తున సభలు నిర్వహించడం….. రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక జిల్లాలు తిరుగుతూ ఉండడం. 2024 మార్చి లో మరల సావిత్రీబాయి ఫూలే వర్ధంతి సభలు , మంగళగిరిలో అడ్వకేట్ మునగ పాటి వర ప్రసాద్ చనిపోతే ఆయన భార్య సంధ్యా రాణి గారు అయన శరీరాన్ని దానం చేస్తే అక్కడకు వెళ్ళిన సందర్భంలో మంగళగిరిలో సభలు ఊరేగింపులు జరపడం ; 2024 ఆగష్టు నెలలో అవయవదాన - శరీర దాన పక్షోత్సవ సభలు, ఆ కార్యక్రమాలలో రోజుకు రెండు మూడు సభలకు హాజరయి మాట్లాడడం, ఆ సభలకు స్వఛ్చందంగా సభికులు హాజరయి హాలులు నిండడం; సంవత్సరం మద్య మద్యలో వచ్చే అంబేద్కర్ , ఫూలే, గుర్రం జాషువా, కార్ల్ మార్క్స్ , లెనిన్ , పెరియార్ తదితర మహనీయుల అనేక జయంతుల , వర్ధంతుల సభలు , సమావేశాలలో పాల్గొనడం. తమ సావిత్రీ బాయి ఫూలే ఎడ్యుకేషనల్ & ఛారిటబుల్ ట్రస్టు ( SPECT) కార్యక్రమాలు , తమకు విజ్ఞప్తులు పంపిన పేద విద్యార్థులను పరిశీలించి , తమ సంస్థ ద్వారా స్కాలర్షిప్ లు అందించడం తదితర అనేక కార్యక్రమాలు…. 

వెళ్ళిన చోటల్లా అక్కడ కలసిన వారి మీద తన ప్రభావం పడవేయడం , ఇవి అన్నీ చూస్తుంటే సీతా మహాలక్ష్మి అంటే ఒక ఉద్యమం , 

ఒక మిషన్ ( Mission) అనిపిస్తుంటుంది.


ఎవరయినా అక్కా! మా ఇంట్లో పిల్లవాడికి బాగో లేదు అంటే తోచిన సాయం చేయడం, అమ్మా ! నా కూతురుకి ఆపరేషన్ కి అవసరం అంటే తోచింది చేయడం, 

నాదెండ్ల బ్రహ్మయ్య హత్య కావించబడితే వారి ఇంటికి వెళ్ళడం, నాదెండ్ల సామ్రాజ్యం 

ఏడుస్తూ చెప్పిన విషయాలకు తాను కూడా ఏడవడం, 

ఆ సామ్రాజ్యంకి తనకు తోచిన సాయం చేయడం; చార్వాక రామకృష్ణ గారి చిన్నబ్బాయి చార్వాక స్వయం మరణం పొందితే , తెలిసి నిడమర్రు వెళ్ళి చార్వాక తల్లి గృహలక్ష్మి గారి బాధలో పాలు పంచు కోవడం.. 


*కుటుంబ సభ్యుల కొండంత అండ*


తన ఉద్యమ కార్యక్రమాలకు 

భర్త ముక్కాల రాజేంద్ర ప్రసాద్, కూతురు ప్రజ్వల , కొడుకు ప్రశాంత్ మరియు అల్లుడు డాక్టర్ మోహన్ సుమేధ, కోడలు ప్రశాంతి ల హృదయపూర్వక మద్దత్తు పొందగలగడం ఆమె చేసిన కృషి యొక్క గొప్పదనం. …….


ఎక్కడకు వెళ్ళినా తనతో పాటు ముగ్గురో , నలుగురో , అంత కంటే ఎక్కువ మందో 

అక్క - చెల్లెళ్ళతో కలిసి తిరగడం( వారు రక్త సంబంధీకులు కారు) , వెళ్ళిన ప్రతి చోటా తన ప్రభావం వేయడం ఆమెకే సొంతం. ఆమె ఎవరో కాదు ఆమెనే గూడూరు సీతా మహాలక్ష్మి. 


*సీతా మహాలక్ష్మి అంటే ప్రజా ఉద్యమాలకు అండ.* 


ఆమె భారత్ బచావో లో పని చేసినా, లాల్- నీల్ మైత్రి కోసం పని చేసినా, ఫూలే - అంబేద్కర్ సంస్తలో ( PARS )

పని చేసినా, ఆ సంస్తల నుండి తాను పేరు ఆశించనక్కర లేదు, ఆమె పేరు ఉండడమే ఆ సంస్తలకు గౌరవంగా భావించే పరిస్తితి ఉంది. విశాఖ పట్టణంలో అయితే అక్కడి సంస్తలు - ఉద్యమాలు అన్నిటిలో భాగ స్వాములు సీతా మహాలక్ష్మి గారు. అది అంబేద్కర్, ఫూలే సంస్తలు అయినా, వామపక్ష ఉద్యమ సంస్తలు అయినా, మహిళా సంఘాలు అయినా, విద్యార్థి సంఘాలు అయినా , గిరిజన సంఘ మహాసభలు అయినా, రైతు- కూలీ , IFTU, సభలు అయినా , పట్టణ బస్తీల పేదల సంఘాల కార్యక్రమాలు అయినా, నాస్తిక , హేతువాద , మానవ వాద సంఘాలు అయినా ….. అవి అన్నీ ఆమెను తమ వేదికల పైకి ఆహ్వానించేవే! గౌరవించేవే! 


పోయిన సంవత్సరం విజయవాడ ముంపుకు గురయిన ప్రాంతాల నిరుపేద ప్రజల కోసం విరాళాలు సేకరించి సహాయాన్ని పాకెట్ కిట్లు రూపంలో అందించడం ఆపన్నుల పట్ల ఆమె స్పందనను తెలుపుతున్నది.


*అవయవదాన ఉద్యమంలో తనకు అండగా నిలచిన వారు.*


అవయవ దాన శరీర దాన ఉద్యమంలో అవసరాల రామకృష్ణారావు గారు, సురాబాబాయి, 

కె. బాబూరావు, ఆనంద్ స్వరూప్, తుమ్మల వేణు గోపాల రావు, చలసాని ప్రసాదరావు , 

S విజయకుమార్ , 

టి. శ్రీరామమూర్తి తదితర విశాఖ ప్రముఖులందరినీ తన కార్యక్రమాలలో భాగస్వామ్యం చేసిన 

తీరు అద్భుతం.


తండ్రి గూడూరు అర్జునుడు గారు చనిపోతే ; నీకు నేను తండ్రిని , నువ్వు నాకూతురివి అని ఓదార్చిన అనిసెట్టి ఆనంద స్వరూప్ గారు, నువ్వు సీతా లక్ష్మివి కాదు ఛీతా లక్ష్మివి ( Cheetha Lakshmi ) అని చెప్పిన 

కె. బాబూరావు గారు, తమ బిడ్డగా హైదరాబాదులో ఆదరించే బొజ్జ తారకం- విజయభారతి దంపతులు, 

వైజాగ్ పని వుండి వెళ్ళేటప్పుడు ; 

మా అమ్మాయి సీతా మహాలక్ష్మి ఇంటికి వెళుతున్నాను అని చెప్పే 

జే బి రాజు గారు; 

అమ్మా ! అని పిలిచే

 సి యల్ యన్ గాంధీ గారు!


అమ్మా! అమ్మా! …..


అని తనను ఆర్ద్రతతో పిలిచే దత్త పుత్రిక A .రజని, దత్త పుత్రుడు కుర్మేటి కృష్ణలు; 


అక్కా! ……….


అని ప్రేమగా పిలిచే 

యన్ జె విద్యా సాగర్, 

మాకా రాజేంద్రన్, 

మేళం భాగ్యారావు, 

చల్లపల్లి స్వరూపరాణి, 

బి యం లీలా కుమారి, అనిసెట్టి రజిత, సుమ , 

తులసి చందు , 

బొజ్జ బిక్షమయ్య, ప్రత్యూష సుబ్బారావు తదితరులు; 


స్నేహపూరిత 

పలకరింపులతో …….


POW సంధ్య, దేవి, 

నూర్ బాషా , పెనుగొండ లక్ష్మీ నారాయణ, డాక్టర్ యం యఫ్ గోపీనాధ్, సి. భాస్కర రావు, రేకా చంద్ర శేఖర రావు , రేకా కృష్ణార్జున రావు , చాపరాల ఇందిర , మార్పు శరత్, 

SR వేమన , ప్రొఫెసర్ శంకర నారాయణ, జి. రాములు …. 


ఇంకా ……


కాట్రగడ్డ భారతి, గురుప్రకాష్, ఉదయ్, శ్రీనివాస్ , ఆడమ్ రాజు , నర్మద, నరేష్ , గోలి మధు …….. ఇంకా వందలాది అవయవదాన , శరీరదాన ఉద్యమ కార్యకర్తల, 

SPECT కార్యకర్తల ప్రేమలు ఆమె పొందడానికి కారణం ఏమిటి? ……..


తెలుసు కుందాం! 

సీతా మహాలక్ష్మి తన జీవితంలో ఏమి చేసిందో 

తన ఎదుగుదల ( brought up) ఏమిటో తెలుసుకుందాం!


*సీతా మహాలక్ష్మి ఎదిగిన క్రమం.*


ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలో స్కూలు టీచరు అయినగూడూరు అర్జునుడు బతక లేని బడి పంతుల కాలం నాటి వాడు. విలువలకు ప్రతినిధి, కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం తన భార్య చంద్ర కాంతమ్మ తండ్రి గారి ద్వారా ఏర్పడి కమ్యూనిస్టు అర్జునుడుగా మారాడు. ఆడ పిల్లలు - మగ పిల్లల తేడాలు లేకుండా 

తన ఆరుగురు పిల్లలను పెంచారు . చిన్న నాటి నుండి చెట్లు ఎక్కడం , ఈత కొట్టడం, గళీలు ఆడడం, తదితర మగ పిల్లల ఆటలు ఆడడం, ఆవు , దూడ, గేదె మెదలైన పశువులతో స్నేహం చేయడం తదితర లక్షణాలతో సీతా మహాలక్ష్మి ఎదిగింది. 

( చదవండి: సీతా మహాలక్ష్మి గారు రాసిన నాన్న కోసం పుస్తకం)


చిన్న నాటి నుండే మహా ప్రస్థానం, ఓల్గా సే గంగా, అమ్మ తదితర పుస్తకాలు చదువుతూ తమ ఇంటికి వచ్చే ఉద్దంరాజు రామం, పుచ్చల పల్లి సుందరయ్య మొదలయిన కమ్యూనిస్టు నాయకుల ద్వారా 

ఆ పుస్తకాలలోని గొప్పదనం తెలుసుకుంటూ ఎదిగింది. 


ఆరవ తరగతి చదివే వయసులోనే రోడ్డు మీద అనారోగ్యంతో నడవలేని ఒక వృద్దుడిని ఆసుపత్రికి తీసుకు వెళ్ళి వైద్యం చేయించి, అమ్మ సరుకులు కొనడానికి అమ్మ చంద్ర కాంతమ్మ గారు ఇచ్చిన డబ్బులు రిక్షాకి , మందులకు ఖర్చు పెట్టి ఖాళీ చేతులతో ఇంటికి భయపడుతూ తల్లి దండ్రులు ఏమయినా తిడుతారు ఏమో అని ఆలోచిస్తూ ఉంటే! …. విషయం ముందుగానే తెలసిన తండ్రి ఆమెను ముద్దాడి , ఆపదలో ఉన్న 

ఒక మనిషిని కాపాడావు తల్లీ 

అని అభినందించారు . తన తండ్రి యొక్క అభినందనలు , ప్రోత్సాహకాలే తన పురోగమనానికి కారణం అయ్యాయి అని ఆమె ఎప్పుడూ తన తండ్రి అర్జునుడిని తలచుకుంటూ ఉంటారు.


*హేతువాద లక్ష్మి*


15 , 16 సంవత్సరాల వయసు లోనే హేతువాద సంఘ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని బాబాల బండారాలు, స్వాముల మోసాలు బయట పెట్టిన తరహా సెన్సేషనల్ పనులు చేసి గుర్తింపు పొందింది. 20 సంవత్సరాల చిన్న వయసులో నే పశ్చిమ గోదావరి జిల్లా హేతు వాద సంఘ కార్యదర్శిగా ఎన్నిక కాబడింది. తాను హేతు వాద ఉద్యమాలలో చేసిన అనేక కార్యక్రమాల ద్వారా హేతువాద లక్ష్మి అని పేరు పొందింది. 


రెండవ భాగం:

ఈ కాలపు అద్భుతమైన మహిళ గూడూరు సీతా మహాలక్ష్మి గారు 


రెండవ భాగం.


*సీతా మహాలక్ష్మి గారి జీవితాన్ని మలుపు తిప్పిన కారంచేడు ఉద్యమం *


ఎప్పుడయితే 1985 లో ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో దళితుల మారణకాండ జరిగిందో , అప్పుడు ఆ ఉద్యమంలోకి ఆమె దూకింది. ఆరు నెలల కాలం ఆ ఉద్యమంలో మమేకం అయింది. కత్తి పద్మారావు తదితర నాయకుల విడుదలకు బొజ్జా తారకం గారి నాయకత్వంలో 600 మంది మహిళలతో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేసి నాయకులను విడుదల చేసేలా యన్టీ ఆర్ ప్రభుత్వంపైన వత్తిడి చేసి; పోరాటాల సివంగి అని పేరు తెచ్చుకుంది.  


ఆ తర్వాత అంబేద్కర్ సాహిత్యం చదివి ఆ ప్రభావ ఫలితంగా కులాంతర వివాహాలను గాఢంగా నమ్మి , అలాటి నమ్మకం కలిగిన ముక్కాల రాజేంద్ర ప్రసాద్ గారిని వివాహం చేసుకున్నది, తన ఇద్దరు పిల్లలకు కూడా కులాంతర వివాహాలు 

ఆ దంపతులు చేశారు. అదీ సీతా మహాలక్ష్మీ దంపతుల నిబద్దత. సిద్దాంతాలను మాటలలో చెప్పడం కాకుండా ఆచరణలో చేయడం వారికే సాధ్యం అయింది. 


*సేవారంగం వైపు మలుపు తిప్పిన సంఘటన*


2000 సంవత్సరం తర్వాత తాను కిడ్నీ సమస్యతో బాధ పడుతూ హాస్పటల్ లో ఉన్నప్పుడు కిడ్నీ ఫెయిల్ అయి చని పోయిన బాలుడిని చూసి ఏడ్చింది. ఆ సంఘటన ద్వారా అవయవ దాన ఉద్యమం ఆవశ్యకత గుర్తించి

తన ఉద్యమాన్ని ప్రారంభించింది. తాను , 

తన తండ్రి ఇంకా మొత్తం 

35 మందితో అవయవ దాన విల్లు పత్రాలు రాసి విశాఖలోని ప్రభుత్వ కాలేజికి - ఆంధ్రా మెడికల్ కాలేజికి అందించింది. అక్కడ నుండి ఆగకుండా తన ప్రయాణాన్ని నిరంతరం కొనసాగించి, జీవన్ దాన్ చట్టాన్ని ఆనాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేసేలా చేసింది. 

ఇంకా SPECT సంస్త ద్వారా వందలాది పేద విద్యార్థులు చదువు కోడానికి ఫీజులు కట్టడానికి తాను సహాయం చేయడమే గాక దాతల ద్వారా సేకరించి అందించడం చేస్తూ ఉన్నారు.


ఈ సంవత్సరం జనవరి 3 న గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజి ఆడిటోరియంలో 1200 మంది పైగా విద్యార్ధినీ, విద్యార్థులతో సభను విజయవంతంగా నిర్వహించారు. 


ముఖ్యంగా……..


ప్రేమ , కరుణ, దయ, మర్యాద మొదలయిన మానవీయ లక్షణాలు మెండుగా గలిగి వున్నారు, అవి ఆమె సహజ లక్షణాలు. మనుషులను విశ్వసించడం కూడా ఆమె సహజలక్షణం. ఈ లక్షణాలే ఉద్యమ నిర్మాణాలలో ఆమె బలం కూడాను. ఈ బలాన్ని కొందరు దుర్వినియోగ పరచిన సందర్భాలు, ఆమెకు ఇబ్బందులు కలిగించిన సందర్భాలు ఉన్నాయి, ఆర్ధికంగా ఆమెకు బాగా నష్టం కలిగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా ఆమె తన సహజ లక్షణాలను వదులు కోలేదు, ఆమె బలం కూడా అవే గదా!


………


*ఈ రోజు - మార్చి 10న పుస్తకావిష్కరణ : *


మార్చినెల పదవ తేదీ సోమవారం సాయంత్రం 

5 గంటలకు హైదరాబాదు రవీంద్ర భారతి కాన్ఫరెన్సు హాలులో మహిళా దినోత్సవం మరియు సావిత్రీ బాయి ఫూలే వర్ధంతి సంయుక్త సభ జరుగుతున్నది.


ఆ సభలో “ సావిత్రీబాయి ఫూలే మార్గంలో గూడూరు సీతా మహాలక్ష్మి “ పుస్తక ఆవిష్కరణ కుల నిర్మూలనా సంఘం నాయకులు , ప్రముఖ న్యాయవాది, సి యల్ యన్ గాంధీ గారి చేతుల మీదుగా జరుగుతున్నది. 


ఆ సందర్భంగా రాసినది 

ఈ వ్యాసం …… 

— సామాజిక వందనాలతో, 

రేకా చంద్ర శేఖర రావు.

Comments