అక్షర జ్ఞానం కోసం అతివలు పడ్డ పాట్లు :
( మహిళా దినోత్సవం సందర్భంగా.)
--- ప్రకాశ్
సుమారు రెండు వందల ఏళ్ల క్రితం స్త్రీలు చదువుకోడానికి ఎన్ని పాట్లు పడ్డారో తెలుసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. బెంగాల్ కి చెందిన రసుందరీ దేవి (1810-1899) అనే ఒక బెంగాల్ రచయిత్రి తన ఆత్మకథలో చెప్పిన విషయాలు చూడండి.
" 12 ఏళ్లకే పెళ్లిచేశారు. ఇంటిపనులతో అర్ధరాత్రి వరకూ తీరిక దొరికేది కాదు. నా పధ్నాలుగో ఏట మా యింటినిండా పుస్తకాలుండేవి. పుస్తకాలు చదవాలనే కోరిక ఉండేది. కానీ ఆడపిల్లలు చదువు గురించి మాట్లాడినా, వాళ్ళ చేతిలో ఓ పేపర్ ముక్క కనిపించినా వయసుపై బడ్డ ఆడవాళ్ళు కయ్యిమనేవారు. మరేం చేయాలి? ఎప్పుడో తరగతి గదిలో పిల్లల మధ్య కూర్చుని నేర్చుకున్న అక్షరాలు గుర్తుచేసుకున్నాను. కానీ వాటిని రాయలేను. ఆడదాన్ని, పైగా పెళ్ళైన దాన్ని. ఒకరోజు నేను వంటింట్లో ఉండగా నా భర్త ‘ నేను బయటకు వెళుతున్నాను. ఈ పుస్తకం నీ దగ్గరుంచి నేనడిగినప్పుడు ఇవ్వు ’ అని ' చైతన్య భగవద్గీత ' నా చేతికిచ్చి వెళ్ళిపోయాడు. ఆ పుస్తకంలోంచి ఒక కాగితం చింపి దాచుకున్నాను. దాన్నెలా చదవాలో తెలియదు. మరోపక్క భయం. చదవడానికి ప్రయత్నిస్తున్నానని తెలిస్తే చివాట్లు తప్పవు. వాటిని భరించడం అంటే మాటలు కాదు. చింపిన కాగితాన్ని మూడో కంట పడకుండా వెదురు అటకపై దాచి పెట్టాను. పనులు పూర్తై పిల్లలందరి అవసరాలూ తీర్చేసరికి అర్ధరాత్రైంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. ఇంక ఆ కాగితం చదవడానికి తీరికేది? మర్నాడు ఉదయం వంట చేసేట ప్పుడు ఆ కాగితాన్ని ఎడమచేతితో పట్టుకున్నాను. చీరకొంగు పైన కప్పి ఉంచాను. కానీ అక్షరాలు గుర్తుపట్టలేకపోయాను. వెంటనే మా పెద్దబ్బాయి దస్తూరి అభ్యాసం కోసం వాడే తాళపత్రాలలోంచి ఒకదాన్ని తీసుకున్నాను. ఒకసారి ఎడమచేతిలోని కాగితాన్ని, ఓసారి తాళపత్రాన్ని చూస్తూ తెలిసిన అక్షరాలను పోల్చుకున్నాను. వెంటనే కాగితాన్ని దాచేశాను. నేను మహిళను కావడం వల్ల, చదువు నేర్చుకోవడం కూడా నేరమైన దుస్థితిలో ఉండాల్సి వచ్చింది "
(WOMEN WRITING IN INDIA 600 B. C. TO THE PRESENT, VOL 1 నుంచి స్వేచ్ఛాను వాదం)
బెంగాలీ సాహిత్యంలో తొలి మహిళా రచయిత్రులలో రసుందరి దేవి ఒకరు. ఆమె ఆత్మకథ అమర్ జిబన్ (నా జీవితం) బెంగాలీ భాషలో ప్రచురితమైన మొదటి ఆత్మకథగా ప్రసిద్ధి చెందింది. ఉన్నత తరగతి/కుల మహిళలకు విద్య నిషేధించబడిన సమయంలో ఆమె స్వయంగా చదవడం రాయడం నేర్చుకుంది. ఆమె ఆత్మకథ వల్ల ఆమె వ్యక్తిగత జీవితంతో బాటు, నాటి సామాజిక ఆచారాలను ఎదిరించిన విధానం వెలుగులోకి తీసుకువచ్చింది.
(శారదా చట్టం (1929) అమల్లోకి వచ్చాక అతి బాల్య వివాహాలు పోయి, బాలికలకు రజస్వలా నంతర పెళ్ళిళ్ళు చేసుకునే అవకాశం ఏర్పడింది. దాంతో ‘తొమ్మిదో ఏట నుంచే పెళ్ళికీ, పదమూడో ఏట నుంచే పిల్లల్ని కనడానికీ ఎదురు చూడవలసిన దుస్థితి తొలగి పోగానే ఆడ పిల్లలు హాయిగా హైస్కూలు చదువూ, కాలేజీ చదువూ చదివే వెసులుబాటు కలిగింది.)
Comments
Post a Comment