'ఆర్.ఎస్.ఎస్ లోతుపాతులు’
(పుస్తక సారాంశం)
----------------------------------------------------------------------------------
పద్మశ్రీ అవార్డు గ్రహీత, కన్నడ రచయిత దేవనూర్ మహాదేవ రాసిన చిన్న పుస్తకం, నికరంగా 35 పేజీలు మాత్రమే, కర్ణాటకలో సంచలనం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కుదుపు కుదిపింది, వారం రోజుల్లో లక్ష కాపీలు అమ్ముడయ్యాయి, ఇంగ్లీషు, హిందీ, వివిధ ప్రాంతీయ భాషల్లోకి అనువాదం అవుతుంది. తెలుగులోనూ అనువాదం అయ్యి లక్ష కాపీలు ప్రజల చెంతకు చేరుతున్నాయి. పుస్తకం పేరు "ఆర్.ఎస్.ఎస్ లోతుపాతులు". దేశ వ్యాప్తంగా ఇంత ఆదరణ పొందడానికి ఇందులో ఏముందో తెలుసుకుని తీరాలి.
రచయిత తన రచన అంకితం ఇస్తూ ఇలా అంటాడు "విశ్వ మానవులైన పిల్లలకు... పెరిగే క్రమంలో కూడా విశ్వమానవులుగానే మిగలాలన్న ఆశతో ఈ పుస్తకం అంకితం." నవ భారత పిల్లలు ఆర్.ఎస్.ఎస్ బారిన పడకుండా ఉండటం కోసం రచయిత ఆవేదన, భాధ్యత తెలియజేస్తుంది. ఆర్.ఎస్.ఎస్ ప్రాణం ఎక్కడుందో తెలియజేస్తూ గోల్వాల్కర్, వి. డి. సావర్కర్ రచనలు నుండి ముఖ్యమైన కొన్ని ఉటంకింపులు ఇచ్చారు.
గోల్వాల్కర్ దృష్టిలో దేవుడు : సూర్యచంద్రులే దేవుని కళ్ళు, అతని నాభి నుండి ఆకాశమూ, నక్షత్రాలు అవతరించాయి. అతని శిరస్సు బ్రాహ్మణులు, బాహువులు రాజులు, తొడలు వైశ్యులు, పాదాలు శూద్రులు. ఈ చాతుర్విధ (చాతుర్వర్ణ) వ్యవస్థను కలిగిన వారే హిందువులు, అటువంటి విరాట పురుషుడే మన దేవుడు...
గోల్వాల్కర్ దృష్టిలో రాజ్యాంగం: "పాశ్చాత్య దేశాల నుండి కొన్ని అధికరణాలను తీసుకుని ఏ సమన్యయమూ లేకుండా ఎలా పడితే అలా కుట్టిన అతుకుల బొంత లాంటిది మన రాజ్యాంగం. ఐక్యరాజ్యసమితి చార్టర్ నుండి, నానాజాతి సమితి నుండి కొన్ని సొట్ట (బలహీన) విధానాలను, అమెరికా, బ్రిటన్ రాజ్యాంగాల నుండి కొన్ని పీలికలనూ తీసుకుని అతుకులు వేశారు."
గోల్వాల్కర్ నుండి మరికొన్ని....
"రాష్ట్రాల యూనియన్ కి సంబంధించిన ఆలోచనలన్నింటినీ లోతుగా పాతి పెట్టాలి. .. స్వయం ప్రతిపత్తి లేదా అర్ధ స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రాల అస్తిత్వాన్ని లేకుండా చేయాలి. కేంద్రీకృత రాజ్య వ్యవస్థను స్థాపించేలా రాజ్యాంగాన్ని మనం పునర్ లిఖిద్ధాం."
"జర్మనీ తన సంస్కృతిని పరిశుద్ధతను కాపాడుకునేందుకు తన .దేశంలో ఉన్న సెమిటిక్ జాతికి చెందిన యూదులను సంపూర్ణంగా అంతమొందించి ప్రపంచాన్ని ఒక దిగ్బ్రాంతికి గురిచేసింది. ఇందులో వారు అత్యున్నత స్థాయి జాతీయతాభావమే కనపడుతుంది. హిందుస్థాన్ వాసులకు ఇది ఒక మంచి పాఠం. దీని నుండి మనం ఎంతో నేర్చుకుని లబ్ధి పొందాలి."
"అల్పసంఖ్యాకులు ప్రజాబాహుళ్యపు కృపాకటాక్షాలు లభించినంత కాలం ఇక్కడ ఉండి, అభ్యంతరం వ్యక్తం కాగానే తిరిగి వెళ్ళిపోవడం. ఇదొక్కటే సరైన పరిష్కారం."
"ఒక జెండా, ఒక నాయకుడు, ఒక సిద్ధాంతం నుండి స్ఫూర్తి పొందే ఆర్ఎస్ఎస్ సంస్థే ఈ బృహత్ దేశంలోని ప్రతి మూలలోను హిందుత్వపు జ్యోతిని వెలిగిస్తుంది."
.. ఇక్కడ జాతీయ విలువలంటే మన ధర్మము, మన సంస్కృతి."
వి.డి. సావర్కర్ ఇలా అంటాడు... "వేదాల తర్వాత మనస్మృతియే అత్యంత పూజనీయమైన మత గ్రంథం, నేడు మనస్మృతియే హిందూ చట్టం."
"నాజీ లేదా ఫాసిస్ట్ మంత్రదండాన్ని చేత పట్టిన కారణంగానే జర్మనీ ఇటలీలు ఎంతో అద్భుతమైన విజయాలు సాధించి మునుపెన్నడూ లేనంత బలమైన దేశాలుగా ఎదిగాయి."
పై అంశాలు చూసినా, గత కొన్నేళ్లుగా దాని నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం తీరు చూస్తున్నా ఆర్.ఎస్.ఎస్ ఎంత ప్రమాదకరమో అవగతం కాగలదు. రచయిత దేవనూర్ మహదేవ ఆర్ఎస్ఎస్ ఉద్దేశాలు గురించి మాట్లాడుతూ ఇలా అంటాడు, "...వారి (ఆర్.ఎస్.ఎస్) గత కాలపు పైశాచిక దృష్టిని మిగతా వారి సంగతెలా ఉన్నా ఏమాత్రం వివేకం గల బ్రాహ్మణులు సైతం ఒప్పుకోరు". "..అవన్నీ గత కాలానికి చెందిన ప్రమాదకర విశ్వాసాలే, వాటితో ఇవాల్టి స్థితిని నిర్మించడానికి ఆర్.ఎస్.ఎస్, దాని అనుబంధ సంస్థలు గత వందేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి." "...శిరస్సైన బ్రాహ్మణుడి ఆజ్ఞకు తగ్గట్టుగా రాజుల పరిపాలన చేయాలి, వైశ్యులు వ్యాపారం చేయాలి, శూద్రులు వీరందరికీ సేవ చేయాలి. ఇదే ఆర్.ఎస్.ఎస్ దృష్టిలో సామాజిక న్యాయం, సామాజిక సామరస్యం, ఇదే వారి దేవుడు, సజీవ పరమాత్మ. " ఆర్.ఎస్.ఎస్ చెప్పే శూద్రులు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మినహా మిగిలిన కులాలన్నీ. అంటే కమ్మ, కాపు, రెడ్డి, వెలమతో పాటు సమస్త బిసి, ఎస్సీ, ఎస్టీ కులాలన్నీ. 97 శాతం ప్రజానీకం కాలం చెల్లిన అనాగరిక భావజాలానికి దాసోహం చేయాలని ఆర్.ఎస్.ఎస్ బోధిస్తుంది. రచయిత దేమ అన్నట్టు విజ్ఞులైన బ్రాహ్మణులు సైతం అంగీకరించని,సమాజంలో అశాంతిని సృష్టించే సిద్ధాంతం ఆర్.ఎస్.ఎస్ ది.
.. పిల్లల మనసుల్లో ముద్ర వేయడానికి, 'చాతుర్వర్ణం నా సృస్టే' అని దేవుని అవతారమైన కృష్ణుడే గీతలో చెప్పాడని చెబుతూ భగవద్గీతను పాఠ్యాంశం చేయడానికి ఆర్ఎస్ఎస్ పరివారం బిజెపి ప్రభుత్వాలు పరిపాలించే చోట్లకల్లా బయల్దేరింది." ఒక సారి స్వామి వివేకానంద భగవద్గీత విశ్వాసనీయత గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు, "...శంకరాచార్యులు ఒక విపులమైన భాష్యం రాసి భగవద్గీతను ప్రసిద్ధం చేయడానికి కంటే ముందు ప్రజలకు భగవద్గీత గురించి పెద్దగా తెలియదు. కొందరు శంకరాచార్యులే భగవద్గీతకర్త అని దానిని ఆయనే మహాభారతంలో చేర్చారని చెబుతారు." (స్వామి వివేకానంద కృతి శ్రేణి (కన్నడ) సంపుటి 7, పుట 80, 81, శ్రీ రామకృష్ణ ఆశ్రమం ప్రచురణ). చాతుర్వర్మ వ్యవస్థలోని అసమానత, బానిసత్వలను 'ధర్మ'బద్ధం చేయడానికి స్వయంగా భగవంతుడే చెప్పాడని ప్రజలను నమ్మించడానికి తర్వాతి రోజుల్లో చేర్చారనేందుకు స్వయంగా వివేకానందుడు చెప్పిన ఈ మాటలు చాలు. ఇదంతా ఆర్ఎస్ఎస్ కు పట్టదు. ఎందుకంటే ఒక జెండా, ఒక జాతి, ఒక సిద్ధాంతం, ఒక నాయకుడు అన్న హిట్లర్ నియంతృత్వ సిద్ధాంతమే వీళ్ళకు ఆదర్శం.
అమిత్ షా నాయకత్వంలోని పార్లమెంటరీ కమిటీ హిందీకి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతికి నివేదిక ఇవ్వడం ఆర్ఎస్ఎస్ అరాచకానికి పరాకాష్ట. మధర్మశాస్త్రం ఆధారంగా రాజ్యాంగాన్ని లిఖించడం కోసం కావచ్చు, సంస్కృతాన్ని భారతదేశ అనుసంధాన భాషగా మార్చడం కోసం కావచ్చు. "ఈ దేశంలో సంస్కృత భాష ఆ స్థానం పొందేదాకా హిందీ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలి" అని గోల్వాల్కర్ 'పంచ్ ఆఫ్ థాట్స్' పుస్తకంలో ఎప్పుడో చెప్పాడు. సంస్కృతాన్ని వాడుక భాషగా చేసే లక్ష్యాన్ని సాధించుకోవడానికి మొదటి మెట్టుగా హిందీని ఉమ్మడి భాషగా తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి.
నేడు సంఘ పరివార్ సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నదాని గురించి రచయిత దేమ ఇలా అంటాడు, "... నిజ నిర్ధారణ జరిగేంతవరకు ఎంతకాలం సజీవంగా ఉంటే అంతకాలం ఉంటుందిలే అన్నట్టుగా ఇప్పుడు వాట్సాప్, ఫేస్బుక్ మొదలైన సామాజిక మాధ్యమాలలో, చర్చల్లో ఇలాంటి అబద్ధాల కలుపే పుట్టి దేశం నలుమూలలా పెరుగుతుంది. ఇటువంటి కథలల్లి అబద్దాల కలుపును వ్యాపింప చేయడం గోల్వాల్కర్ కానుకే! ఇప్పుడు ఆర్ఎస్ఎస్, దాని పరివారం నుండి ఇటువంటి అబద్ధాలు ప్రచారం నిరాటంకంగా, నిరంతరం జరుగుతుంది."
ఆర్ఎస్ఎస్ పుట్టినప్పుడే, వేషాలు వేసి వంచించే ఆట కూడా పుట్టిందనుకోవాలి! దీనికొక ఉదాహరణ: 1948 మార్చి 14 న డా. రాజేంద్రప్రసాద్ ప్రధాని నెహ్రూ, హోం మంత్రి పటేల్ లకు రాసిన ఉత్తరం. అందులో "ఆర్ఎస్ఎస్ వాళ్లు ఏదో గందరగోళం సృష్టించబోతున్నారని నాకు వార్త అందింది. వాళ్లు అనేక మంది హిందువులకు ముస్లిం వేషం వేసి ఇతర హిందువులపై దాడి చేయించి గొడవలు రేపి, మిగతా హిందువులను రెచ్చగొట్టే పన్నాగం పన్నుతున్నారని తెలిసింది. హిందూ, ముస్లింల మధ్యన ఈ రకమైన ఘర్షణ ఒక మహాకాష్టానికి అగ్గి రాజేసేలా వుంది" అని హెచ్చరించారు. ఆ కాలంలోనే అన్ని అయితే ఈ కాలంలో ఇంకెన్నో!. ఇలాంటివన్నీ చూసినప్పుడు వీళ్ళలో ఏ దేవుడు లేడు, అబద్ధమే వీరి ఇంటి దైవం, అబద్ధాల ఉత్పాదకతలో నిండా మునిగిపోయి వీరు తమ మనస్సాక్షినే ఉరి వేసుకున్నారేమో అనిపిస్తుంది.
మతమార్పిడి గురించి న్యాయమూర్తి హెచ్. ఎస్. నాగమోహన్ దాస్ ఇలా అంటారు, "...దేశంలో ఉన్న ముస్లింలు, క్రైస్తవులు అందరూ విదేశాల నుండి వచ్చిన వారేనా? చాతుర్వర్ణంలో, కుల వ్యవస్థలో అనేక విధాలుగా నలిగి హిందూ సముదాయాల నుండి మతమార్పిడి చెందిన వారే ఈ రెండు మతాలలోనూ అధిక సంఖ్యలో ఉన్నారు కదా? అదీ కాక, భారతదేశంలోకి ఇస్లాం ప్రవేశించిన ఆరంభ దశలో అధికారం కోసమో, పదవుల కోసమో, ఇతర ప్రలోభాల కోసమో మత మార్పిడి చెందినవారు అధికంగా ఉత్తర భారతదేశపు ఆర్య బ్రాహ్మణులే కదా?".
గోల్వాల్కర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు వివేచనాశక్తి అస్సలు అవసరం లేదంటూ ఇలా అంటాడు, "... మన జీవితంలో ఇక ఎంపిక ప్రశ్నే ఉండదు. చెప్పినట్లు చేసుకుంటూ పోవడమే. కబాడ్డీ ఆడమంటే కబడ్డీ ఆడండి, సభ పెట్టమంటే సభ పెట్టండి... ఉదాహరణకు మన మిత్రుల్లో కొందరికి రాజకీయాల్లో పని చేయమని చెప్పడం జరిగింది. అంటే వారందరికీ రాజకీయాల్లో భారీ ఆసక్తి ఉందనో లేదా సామర్థ్యం ఉందనో కాదు. రేపు రాజకీయాలు మానుకోమంటే నీళ్లు లేకపోతే చేపలు చచ్చిపోయినట్టు వాళ్ళు ఏమి చచ్చిపోరు. బయటకు రమ్మని చెబితే వాళ్లకు ఏ ఆక్షేపనా ఉండదు. వాళ్లకసలు వివేచనా శక్తి అక్కర్లేదు".
దేవనూర్ మహాదేవ ఆవేదన చెందినట్టు దిగులు పడాల్సిన సంగతి ఏమిటంటే లేత వయసు పిల్లలను పట్టుకొచ్చి తమ సంఘటనలో భాగం చేస్తున్నారు. వాళ్ళు మనుషులను తయారు చేయడం లేదు. స్వయం సేవకులనే పేరుమీద అమానవీయ రోబోలను తయారు చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ నోటికి చిక్కే ఈ పిల్లలను కాపాడుకోవడం ఎలా?.
ఆయనింకా ఇలా అంటాడు,
"ఏ మతోన్మాదమైన మొదట తన వాళ్ళ కళ్ళను పీకి అంధులను చేస్తుంది, తర్వాత మెదడను పీకి అవివేకులను చేస్తుంది, తర్వాత హృదయాలను పీకి క్రూరులుగా మారుస్తుంది. తర్వాత నరబలిని కోరుకుంటుంది. ఇప్పుడు ఇది మితిమీరిపోతుంది. అతి త్వరగా మన పిల్లల కళ్ళు, గుండె, మెదడులను ఈ మతోన్మాదపు నోటికి చిక్కకుండా కాపాడాల్సి ఉంది."
హిందువులకు విజ్ఞప్తి చేస్తూ, "... అమానుష కృత్యాలను చూసి ఊరికినే ఉండిపోకుండా విశాలమైన హిందూ సమాజం ఈ సంక్షోభ సమయంలో గొంతెత్తి మాట్లాడాల్సి ఉంది. బ్రాహ్మణుల నుండి ఆదివాసులు దాకా అనేక కులాల గల బహుసంఖ్యాక మానవీయ హిందూ సమాజం ఈ విషయంలో కార్యోన్ముఖులం కావాల్సుది."
జయప్రకాష్ నారాయణ్ తన జీవిత చరమ దశలో ఆర్ఎస్ఎస్ నాయకుల గురించి "వారు నమ్మకద్రోహం చేశారు" అని ఒక సన్నిహితుని వద్ద పరితపించారు. ఇప్పుడు, ఒకే గొడుగు కింద ఎంతో వైవిధ్యంతో కూడిన వందలాది ధర్మాలతో విలసిల్లుతున్న సమృద్ధ హిందూమతం కూడా జయప్రకాష్ నారాయణ్ గారిలా 'నేనూ మోసపోయాను' అని పరితపించేటట్లుంది
విదేశాల్లో దాచిపెట్టిన నల్ల డబ్బును తిరిగి తెచ్చి ప్రతి భారతీయుని అకౌంట్లో 15 లక్షల చొప్పున వేస్తానని స్వయంగా ప్రధానమంత్రి మోడీగారే అన్నారు. ఏడాదికి కోట్ల కొద్ది ఉద్యోగాలను సృష్టిస్తామన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. ఇవేమీ చేయలేదు సరిగదా వీళ్ళు దేనిని మిగల్చడం లేదు. ప్రజలందరికీ ఉమ్మడి సంపదను ప్రైవేటుకు అమ్ముతూ బతుకుతున్నారు.
ఇప్పుడు దేశంలో మూడు రకాల పార్టీలు ఉన్నాయి. (1) 'ఏక వ్యక్తి నియంత్రిత' రాజకీయ పార్టీలు (2) 'కుటుంబ నియంత్రిత' రాజకీయ పార్టీలు (3) 'రాజ్యాంగేతర సంఘాలు / సంస్థల నియంత్రిత' రాజకీయ పార్టీలు. నేడు దేశంలో ఏదో ఒక చోట ఈ మూడు రకాల పార్టీలు పరిపాలన చేస్తున్నాయి. ఈ మూడూ ప్రజాస్వామ్యానికి వినాశకరమైనవే. ఇప్పుడు దేశపు చుక్కాని రాజ్యాంగేతర సంఘం / సంస్థ నియంత్రణలో ఉన్న బిజెపి చేతిలో ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి అన్నిటికంటే ప్రమాదకరమైనది. రాజ్యంగేతర సంఘం నియంత్రించే పార్టీ రాజకీయాలలో మరొక ముఖ్యమైన అంశాన్ని మనం గమనించాలి. ఉదాహరణకు. బిజెపికి మెజారిటీ తెచ్చిపెట్టే ప్రధాని అయిన మోడీని వారు చాలా శక్తివంతుడైన నాయకుడిగా చూపించే ప్రయత్నం చేస్తారు. నిజానికి ఈయనొక ఉత్సవమూర్తి మాత్రమే. అసలు దేవతామూర్తి అయిన ఆర్ఎస్ఎస్ నాగపూర్ గుడిలో సుఖంగా కూర్చూనుంటే ఉత్సవమూర్తేమో దేశమంతటా విశ్రుంఖలంగా తిరుగుతూ ఉంటుంది. జై జై నినాదాలతో ఎక్కడా లేని బలం పుంజుకుంటూ ఉంటుంది. ఈ ఉత్సవమూర్తికి కావలసిన సామర్థ్యం ఏమిటంటే - మాటలతో ప్రజలను ఆకట్టుకునే కళ, పరిపాలనలో సమస్యలు ఎదురైనప్పుడు పరిస్థితిని ఎమోషనల్ గా మార్చి గొడవలు రేకెత్తించి పక్కదారి పట్టించే తెలివితేటలు, ప్రజలను బురిడే కొట్టించే విద్య, వాటి కంటే ముఖ్యమైనది గర్భగుడిలోని దేవుని పట్ల పరమ విధేయత. ఇదే వారికి కావాల్సింది. ... ఇది మహా ప్రమాదం, నేడు ప్రజాస్వామ్యానికి ఇదే అన్నిటికంటే ఎక్కువ ప్రమాదం.
.. చాతుర్వర్ణ వ్యవస్థ బలోపేతానికి మనుధర్మ శాస్త్ర సూత్రాలను చట్టాలలోకి జొప్పించడానికి భారత రాజ్యాంగాన్ని గుల్లబార్చడానికి, ఇస్లాం, క్రైస్తవాలపై అసహనం వెళ్లగక్కడానికి, ఆర్యజాతి ఔనత్య సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవడానికి కొత్త కొత్త చట్టాలను, ఉన్నవాటికి సవరణలను తీసుకొస్తూనే ఉంది. కర్ణాటకలో కొత్తగా తీసుకొచ్చిన 'మత స్వేచ్ఛ రక్షణ చట్టం' పైకి ఏదో మామూలు చట్టంగా కనబడుతుంది కానీ దాని పొట్టని చీల్చి చూస్తే లోపల భారత రాజ్యాంగ విద్వంసము, మన ధర్మశాస్త్ర ప్రతిష్టాపన కనపడతాయి.
..చాతుర్వన్నాన్ని తలకెత్తుకునే ఆల్ఫ హిందూ సముదాయం తానే మొత్తం హిందూ మతానికి మార్గదర్శిని అని భావించుకోవడం నైతికంగా సమర్ధనీయమా? అందుకే వారు వాడే 'హిందూ ధర్మం' అన్న పదాన్ని మనం సరిచేసి ఇకనైనా అది 'చాతుర్వర్ణ మత'మని చాటి చెప్పాలి. గోల్వాల్కర్ ప్రవచించే చాతుర్వర్ణ పద్ధతే ధర్మమైతే భారతదేశ రాజ్యాంగం ఇచ్చిన వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛల సంగతేమిటి? అంతే కాదు, ఒకప్పటి చాతుర్వర్ణ వ్యవస్థలో శూద్రుల స్థానంలో ఉన్నవారు ఇప్పుడు మళ్లీ శూద్రులవ్వాలా? అంటే మళ్ళీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులనే అగ్రవర్ణాల వారికి సేవకులగా జీవితాంతం బతకాలా? ఈ ప్రశ్నలను మనం గట్టిగా అడగాలి, అవసరమైతే డికొనేలా ప్రశ్నించాలి. చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని నిరాకరించే దేశీయ మతాలకు ఉనికిని సైతం లేకుండా చేయడానికి ఆర్ఎస్ఎస్ అహర్నిశలు శ్రమిస్తుంది.(ఇక్కడ శూద్రులంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మినహా మిగిలిన సమస్త ఓసి, బిసి, ఎస్ సి, ఎస్ టి కులాలన్నీ. విజ్ఞులైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు కూడా ఆర్ఎస్ఎస్ చెప్పే చాతుర్వర్ణ వ్యవస్థను అంగీకరించరు. అందుకనే రచయిత దేవానూర్ మహాదేవ ఆర్ఎస్ఎస్ విషయంలో హిందూ సమాజం కార్యోన్మఖం కావాలని పిలుపిచ్చాడు. - ఈ వక్కానింపు నాది)
విద్యా రంగానికొస్తే ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ ముందుగా చేయి వేసేది విద్యా, చరిత్రల మెడల మీదే. స్కూల్ సిలబస్ లో పౌరోహిత్యం, కర్మకాండ అనే అంశాలను చేర్చారు, వైజ్ఞానిక ఖగోళ శాస్త్రానికి బదులు జ్యోతిష శాస్త్రాన్ని నేర్పడం ప్రారంభించారు, మగసంతానాన్ని పొందడానికి పుత్ర కామేష్టి యాగం ఎలా చేయాలో పాఠాన్ని కూడా సిలబస్ లో చేర్చారు. ఇటీవల సి.బి.ఎస్.సి కూడా తన పదవ తరగతి సిలబస్ నుండి అనేక పాఠ్యాంశాలను తీసేసింది. ఎన్.సి.ఇ.ఆర్.టి మీద మరికొన్ని పాఠ్యాంశాలను కూడా తీసేయమని నిత్యం ఒత్తిడి పెడుతూనే ఉంది. ఆదివాసులు, మూలవాసులు అనే వెనుకటి పేర్లను చెరిపేసి వారికి 'వనవాసి' అని నామకరణం చేసింది ఆర్ఎస్ఎస్. ఇటీవల రాఖిగడ్ లో దొరికిన శిరాజాలపై డిఎన్ఏ అధ్యయనం జరిగినప్పుడు అక్కడ ఆర్య లేదా వైదిక నాగరికతకు సంబంధించిన ఆనవాలేమి లేవని తేలింది. దిగ్భ్రాంతికి గురైన ఆర్ఎస్ఎస్ 'సింధూ నాగరికత' పేరును మార్చి 'సరస్వతీ నాగరికత' అనడం మొదలుపెట్టింది. అయినా ఆర్యులు బయట నుండి వచ్చిన వారని ఒప్పుకుంటే మనకు వచ్చిన నష్టం ఏమిటి? భారత భూమి తన నేలలో పుట్టిన బిడ్డలను తన వారేననుకుని గుండెలకు హత్తుకుంటుంది. పైగా భారతదేశంలో ద్రావిడ, ఆర్య, ఇస్లాం, క్రైస్తవ, రక్తాలన్నీ వేరు చేయలేనంతగా కలిసిపోయాయి. అలాంటప్పుడు నోరు మూసుకొని ఉండడానికి ఆర్ఎస్ఎస్ కు ఏమయ్యింది? వర్తమానంలో బతకడానికి ఏమయ్యింది? ఆర్య ఔన్నత్యం సిద్ధాంతం అనే తిక్క రోగానికి చిక్కి విలవిలలాడుతున్న రోగిష్టిలా అనిపిస్తుంది ఆర్ఎస్ఎస్.
' .... ఏదో ఒక రోజు మనం భారత స్వాతంత్ర్య పోరాటాన్ని వ్యతిరేకించిన ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెగ్డేవర్ గురించి, బ్రిటీష్ ప్రభుత్వానికి క్షమాపణ పత్రం రాసిచ్చి జైలు నుండి విడుదలై నేడు వీరుడిగా కీర్తించబడుతున్న వి.డి. సావర్కర్ గురించి భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చి పెట్టిన సమరయోధులని పాఠ్యపుస్తకాలలో సదవాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు. ...గాంధీని చంపిన గాడ్సే గురించి 'హిందూ ధర్మ రక్షకుడు' అనే పురాణ కథ ఒకటి పుట్టొచ్చు
'.... హిజాబ్, హలాల్ చేసిన మాంసం అమ్మకాల నిషేధం, ఆజాన్ మొదలైన వాటిపై గొడవలు చేసే శ్రీరామసేన, బజరంగదళ్ లలో ఉన్న కుర్రోళ్లంతా ఎవరు? వీరంతా దాదాపు బడుగు, బలహీన వర్గాలకు చెందిన యువకులే కదా? దేశ అభివృద్ధి విధానాలు వీరి సామర్థ్యానికి అనువైన ఉద్యోగాల కల్పన మీద దృష్టి పెట్టనక్కరలేదా? కానీ ఆర్ఎస్ఎస్ సంతానమైన బిజెపి ప్రభుత్వానికి ఇదేమి అక్కర్లేదు. ఆర్ఎస్ఎస్ బిజెపిలకు శూద్రులు తమ కాలి వద్ద కుక్కలుగా పడుండాలి, అభద్రతతో మగ్గిపోవాలి, చాతుర్వర్ణ పద్ధతిలో లాగా వారు ఎప్పటికీ సేవకులుగానే, వెట్టి చాకిరీ కూలీలుగానే మిగలాలి.
పరిశోధనా సంస్థ అయిన సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) వెల్లడించిన ఘనంకాల ప్రకారం 2017 - 2022 మధ్య కేవలం 5 ఏళ్లలో 2 కోట్ల కన్నా ఎక్కువ మంది స్త్రీలు కార్మికుల జాబితా నుండి కొనుమరుగయ్యారు. '....ఆడవాళ్లు ఇళ్లల్లోనే ఉండాలి అనే ఆర్ఎస్ఎస్ హిడెన్ ఎజెండా ప్రకారం జరిగిందా? ఎన్నో ప్రశ్నలూ, అనుమానాలు కలుగుగుతాయి. '... స్త్రీ విద్య కనుమరుగవుతొంది. కులమత భేదాల తారతమ్య విద్య రాజ్యమేలుతోంది. ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తాయంటే పూర్వం చాతుర్వర్ణ పద్ధతిలో శూద్రులకు విద్యను నిషిద్ధం చేశారే, ఖచ్చితంగా అక్కడికే దారి తీస్తాయి.
భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ ఏ పాలకులూ, రాజులూ, చక్రవర్తులూ మత మార్పిడి నిరోధక చట్టాన్ని జారీ చేసిన ఉదాహరణలు లేవు. భారతదేశం సర్వ ధర్మ, మత, ఆధ్యాత్మిక ప్రయోగాల నేల. ఇదే భారతీయ సంస్కృతి, ఇదే భారతీయ వారసత్వం, దీనినే భారతీయత అంటారు. చరిత్రకారులు 'యుద్ధం వైవాహిక సంబంధంతో ముగుస్తుంది' అని చెబుతుంటారు. భారతీయ పురాణాల్లో కూడా దేవుళ్ళు, దేవతలు యుద్ధాలు చేసి, ఓడి, గెలిచి చివరకు వైవాహిక సంబంధంతో కలిసిపోయి ఒకటిగా బతికారు. కానీ, పరమ భక్తులుగా పిలవబడే వీళ్ళు మాత్రం ద్వేషం, అసహనం, మతోన్మాద, కులోన్మాద బురదలోనే బతుకుతున్నారు.
ఇప్పటికైనా సమాజంలో పురోగతిని సాధించాలనుకుంటున్న సంఘాలు, సంస్థలు, పార్టీలు తమ విభేదాలను అధిగమించి చిన్న చిన్న సెలయేళ్ళుగా సాగుతున్న తమ ప్రవాహాలను ఒక ఐక్య ప్రవాహంలోకి మళ్ళించాలి. '... మొదటిగా మనలో మేలుకొలుపు రావాలి. ఆర్ఎస్ఎస్ కూగుమారీల గుంపు మన ఇంటి ముందుకొచ్చి అరిచినప్పుడు, బదులు ఇవ్వకుండా 'రేపు రా' అని మనం కూడా మన జానపదుల్లా ఇంటి తలుపుల మీద రాయాలి. మనం బదులిస్తే, దానితో గొంతు కలిపితే, మన పతనం ఆ రోజు నుండే ఆరంభమవుతుంది. గ్రామీణులు అనుభవం ద్వారా గ్రహించిన 'విచ్ఛిన్నతే దెయ్యం, ఐక్యతే దైవం' అన్న వివేకం మనది కూడా కావాలి.
'...దీనిని గుర్తించుకుని అందరం కలిసికట్టుగా నడుద్దాం.
'ఆర్.ఎస్.ఎస్ లోతుపాతులు’ పుస్తకం ఇంటికొకటి చేర్చుదాం.
✍️ పెద్దింశెట్టి రామకృష్ణ
9492383977
Comments
Post a Comment