*🔊యూపీఐ చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలుండవ్*
*🔶రూ.3,000 దాటితే 0.3% అంటూ ప్రచారం*
*🔷ఖండించిన ఆర్థిక శాఖ*
*🍥ఈనాడు, హైదరాబాద్: డిజిటల్ లావాదేవీల్లో 83 శాతానికి చేరిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) చర్యలు తీసుకుంటోంది. ఈ వ్యవస్థపై ఒత్తిడి తగ్గించేందుకు, యూపీఐ యాప్ సాయంతో ‘బ్యాంకు ఖాతాలో నగదు నిల్వ పరిశీలన’ సంఖ్యపై పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే రూ.3,000కు మించి జరిపే యూపీఐ చెల్లింపులపై 0.3% మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) విధిస్తారని బుధవారం ప్రచారం హోరెత్తగా, అటువంటిదేమీ లేదని ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది.*
*💠యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌ను ప్రభుత్వం 2020 జనవరిలో రద్దు చేశాక, ఈ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. ఇందుకవసరమైన టెక్నాలజీ, ఇతర వ్యవస్థల కోసం బ్యాంకులు, యూపీఐ ఆధారిత చెల్లింపు సేవలు అందించే సంస్థలు (గూగుల్‌పే, ఫోన్‌పే వంటివి) పెట్టుబడులు పెంచాల్సి వస్తోంది.*
*💥ప్రస్తుతం కార్డు లావాదేవీలపై*
*➡️ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలపై 0.9% నుంచి 2% వరకు ఎండీఆర్ ఛార్జీ వసూలు చేస్తున్నారు. ఎన్‌పీసీఐ నెట్‌వర్క్‌పై పనిచేసే రూపే కార్డులపై ఎలాంటి ఛార్జీలూ లేవు. రూ.2,000లు దాటిన ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్ (పీపీఐ) యూపీఐ లావాదేవీలపై 1.1% ఇంటర్‌ఛేంజ్ ఫీజు వర్తిస్తోంది.*
*➡️అయితే యూపీఐ లావాదేవీలపై ప్రజల నుంచి రుసుం వసూలు చేయకుండా, ప్రభుత్వమే రూ.1,500 కోట్లు అందిస్తోంది. అయితే లావాదేవీల పరిమాణం భారీగా పెరిగినందున, ఈ మొత్తం సరిపోవడం లేదని, కనీసం రూ.10,000 కోట్లు అవసరమని అంచనా. ఈ నేపథ్యంలోనే తాజా ఊహాగానాలు వచ్చాయి.*
*🥏ఏమిటీ ఎండీఆర్?: క్రెడిట్- డెబిట్ కార్డు, యూపీఐ వంటి వ్యవస్థల ద్వారా చెల్లింపులు స్వీకరించే వ్యాపారుల నుంచి బ్యాంకులు లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు వసూలు చేసే రుసుమునే మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)గా పిలుస్తారు. లావాదేవీ విలువను బట్టి ఈ రుసుము మారుతుంది. లావాదేవీలు సురక్షితంగా, వేగంగా జరిగేలా చూసేందుకు సర్వర్లు, సాఫ్ట్‌వేర్, రక్షణ వ్యవస్థల నిర్వహణకు ఈ రుసుము ఉపయోగపడుతుంది. బ్యాంకులు, పేమెంట్ వేదికలకు ఈ రుసుము ఆదాయ వనరుగా చెప్పొచ్చు. ఉదాహరణకు ఒక వ్యాపారి రూ.10,000 చెల్లింపును యూపీఐ పద్ధతిలో స్వీకరించారనుకుందాం. ఎండీఆర్ 0.3% అయితే రూ.30 రుసుము వర్తిస్తుంది. వ్యాపారికి రూ.9,970 మాత్రమే వెళ్తాయి. ఎండీఆర్ కింద వసూలు చేసిన రూ.30ను బ్యాంకులు, కార్డ్ నెట్‌వర్క్‌లు (వీసా, మాస్టర్‌కార్డ్), యూపీఐ ప్లాట్‌ఫారమ్‌లు (గూగుల్‌పే, ఫోన్‌పే వంటివి) పంచుకుంటాయి.*
Comments
Post a Comment